paruchuri gopalakrishna: 'ఒక్కడు' .. ' రాజా ది గ్రేట్' కథల్లో పోలిక వుంది: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఒక్కడు'లో కొడుకు పోలీస్ కావాలని తండ్రి కోరుకుంటాడు
- 'రాజా ది గ్రేట్'లో కొడుకు పోలీస్ కావాలని తల్లి ఆశపడుతుంది
- రెండు సినిమాల్లోను విలన్ వేరే వారి చేతిలో చనిపోతాడు
సినీ రచయితలుగా పరుచూరి బ్రదర్స్ ఎంతో అనుభవాన్ని గడించారు .. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. అలాటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.
"కథా పరంగా చూసుకుంటే 'ఒక్కడు' .. 'రాజా ది గ్రేట్ ' సినిమాలకి దగ్గర పోలికలు కనిపిస్తాయి. 'ఒక్కడు' సినిమాలో .. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు వీధి పోరాటాలు చేస్తూ ఉంటాడు. అతను కబడ్డీ ఆట గెలిస్తే దాని ద్వారా పోలీస్ ఉద్యోగం వస్తుందని ఓ తండ్రి ఆశపడి కర్నూలు పంపిస్తే, అక్కడ కష్టాల్లో వున్న ఓ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి కోసం ఎన్నో కష్టాలు పడి చివరికి కబడ్డీ గెలుస్తాడు .. ఆ అమ్మాయిని గెలుచుకుంటాడు.
ఇక 'రాజా ది గ్రేట్' విషయానికొస్తే .. ఒక లేడీ కానిస్టేబుల్ తన కొడుకు పోలీస్ అవ్వాలనుకుంటుంది. అందుకని కబడ్డీ పోటీలో తన కొడుకు పాల్గొని పేరు తెచ్చుకుంటే రికమెండేషన్ తో పోలీస్ ఉద్యోగం ఇప్పించుకోవచ్చని ఆశపడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే .. కష్టాల్లో వున్న ఒక అమ్మాయికి అండగా ఉండేలా చేస్తుంది. ఆ అమ్మాయిని కాపాడటం కోసం అతను ఎన్నో కష్టాలు పడతాడు. ఈ రెండు సినిమాల్లోను క్లైమాక్స్ లో విలన్ ను హీరోతో కాకుండా వేరొకరితో చంపిస్తారు. ఇప్పుడు హీరోను అరెస్ట్ చేస్తారేమోననే అనుమానంతో ప్రేక్షకులు బయటికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే అలా చేశారు. ఇప్పుడు అర్థమైంది కదా ప్రాధమికంగా రెండు లైన్లు ఒకటే .. స్క్రీన్ ప్లే లోనే మార్పు కనిపిస్తుంది " అని చెప్పుకొచ్చారు.