Narendra Modi: ఓ ఎంపీ నా దగ్గరకొచ్చి 'ఉఠో ఉఠో ఉఠో' అన్నారు.. ఆయనకు ఎంత తొందరో!: రాహుల్ పై మోదీ సెటైర్
- అధికారంలోకి రావాలని ఆయనకు తొందరగా ఉంది
- ప్రజలు ఎన్నుకోవడం వల్లే మనం ఇక్కడున్నాం
- సభలో నవ్వులు పూయించిన ప్రధాని
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ తన ప్రసంగంలో వీలుచిక్కినప్పుడల్లా చురకలు అంటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా చివర్లో మాట్లాడిన మోదీ.. రాహుల్‌పై సెటైర్లు వేశారు. ‘‘ఉదయం ఓ ఎంపీ నా దగ్గరికి పరుగు పరుగున వచ్చారు. వచ్చీ రావడంతోనే ఉఠో ఉఠో ఉఠో (లే లే లే) అని తొందరపెట్టారు. అధికారంలోకి రావాలని ఆయనకు ఎంత తొందరగా ఉందో’’ అని అనడంతో సభ్యులు నవ్వాపుకోలేకపోయారు. ‘‘ఆయనకు నేనొకటి చెప్పదలచుకున్నా. ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. అందుకే ఈ రోజు మనం ఇక్కడున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.
అంతకుముందు ఉదయం రాహుల్ గాంధీ అవిశ్వాసం తీర్మానంపై వాడివేడిగా ప్రసంగించారు. మాట్లాడడం ముగించిన తర్వాత వడివడిగా అడుగులేస్తూ మోదీ దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నారు. మోదీ తేరుకునే లోపే వెనుదిరిగారు. అంతలోనే తేరుకున్న మోదీ.. రాహుల్‌ను పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. బాగా మాట్లాడావంటూ ప్రశంసించారు.