Telugudesam: నేటి మా స్ట్రాటజీ ఇదే: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • కేంద్రాన్ని దుమ్మెత్తి పోయాలని నిర్ణయించాం
  • నెరవేర్చని హామీలను గుర్తు చేస్తాం
  • దేశమంతటికీ తెలిసేలా చూస్తాం 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి విభజన హామీలను అమలు చేయని కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ, నేడు చర్చలో కేంద్రాన్ని దుమ్మెత్తి పోయాలని నిర్ణయించింది. తమకు ఇచ్చిన 13 నిమిషాల సమయం చాలదని, అవిశ్వాసం పెట్టింది తామే కాబట్టి, మరింత సమయం ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్టు టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

 ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, తమ తరఫున గల్లా జయదేవ్ చర్చను ప్రారంభిస్తారని, ఆపై అవకాశాన్ని బట్టి మరొకరు లేదా ఇద్దరు మాట్లాడతారని అన్నారు. ప్రత్యేక హోదాగానీ, విభజన చట్టంలో ఉన్న హామీలు గానీ... ఏవైతే కేంద్రం నెరవేర్చలేదో వాటిని గుర్తు చేస్తామని అన్నారు. కేంద్రం ఏవైతే కారణాలు పెట్టి జాప్యం చేస్తోందో, అవి సరైన కారణాలు కావన్న విషయాన్ని దేశమంతటికీ తెలిసేలా చూస్తామని అన్నారు.

రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలను కేంద్రం సాకుగా చూపుతోందని ఆరోపించిన ఆయన, చిత్తశుద్ధి ఉంటే అన్ని హామీలనూ నెరవేర్చవచ్చని తెలియజెప్పే వ్యూహంతో ఉన్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రెవెన్యూ లోటు, అమరావతికి నిధులు తదితర అంశాలనూ ప్రస్తావిస్తామన్నారు. మొత్తం 19 అంశాలను లోక్ సభలో గుర్తు చేయనున్నట్టు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News