Chandrababu: అవిశ్వాసంపై చర్చలో ఐదు కోట్ల ప్రజల గొంతుకలు వినిపించాలి: సీఎం చంద్రబాబు

  • టీడీపీ ఎంపీలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ 
  • రేపటి రోజు చాలా కీలకం
  • ఈ అవకాశాన్ని ఎంపీలు సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలతో ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రేపటి రోజు చాలా కీలకమని, అన్ని పార్టీల నేతలను, ఎంపీలను కలవాలని, అందరి మద్దతు కూడగట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కు సంఘీభావం కోరాలని, ఇదో చారిత్రక అవకాశమని, స్ఫూర్తిదాయక సమయమని అన్నారు.

ఆ రోజు విభజన బిల్లు ఆమోదం ఎలా జరిగిందో గుర్తుచేయాలని, నాలుగేళ్లలో జరిగిన అన్యాయాన్ని వివరించాలని సూచించారు. ఎవరిలోనూ మన పట్ల వ్యతిరేకత ఉండకూడదని, వీలైతే మనకు తోడ్పాటు ఇవ్వాలి లేదా తటస్థంగా ఉండాలని కోరాలని చెప్పారు. తాను కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడతానని, మనకు సంఘీభావం కోరతానని,. అవిశ్వాసంపై చర్చ 7 గంటలు జరిగే అవకాశం ఉంది కనుక, టీడీపీ ఎంపీలకు 15 నిమిషాల పైనే మాట్లాడే అవకాశం ఇస్తారని అన్నారు. కానీ, మాట్లాడేందుకు మరింత ఎక్కువ సమయం కావాలని లోక్ సభలో కోరాలని, ఈ చర్చలో పాల్గొనే ఎంపీలు పూర్తిగా సంసిద్ధం కావాలని ఆదేశించారు.

చట్టంలోని అంశాల అమలును అధ్యయనం చేయాలని, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలును చర్చించాలని సూచించారు. మన కళ్ల ముందు రాష్ట్ర ప్రయోజనాలే కనిపించాలని, ఎంపీల దృష్టి అంతా ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుపైనే ఉండాలని టీడీపీ ఎంపీలకు నిర్దేశించారు. ఈ అవకాశాన్ని ఎంపీలు సద్వినియోగం చేసుకోవాలని, 5 కోట్ల ప్రజల గొంతుకలు లోక్ సభ వేదికగా వినిపించాలని అన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు సుజనా చౌదరి, తోట నరసింహం, గల్లా జయదేవ్, ఇతర ఎంపీలు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.                      

  • Loading...

More Telugu News