narasampet: నర్సంపేట రూపురేఖలు మారుస్తాం: మంత్రి కేటీఆర్

  • పట్టణ పురపాలిక సమీక్షా సమావేశం
  • అధికారులకు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం
  • తాగునీటి సరఫరాపై ప్రత్యేకంగా అడిగిన కేటీఆర్

నర్సంపేట పట్టణ రూపురేఖలు మారుస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో పట్టణ పురపాలిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పట్టణాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల రూపకల్పనపై పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వం తరఫున ఇప్పటికి రూ.20 కోట్ల ప్రత్యేక నిధులను నర్సంపేట మున్సిపాలిటీకి ఇచ్చామని, ఈ నిధుల ద్వారా పట్టణంలోని కనీస మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ సమీక్షా సమావేశం సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, రోడ్లు పార్కులు, చెరువులు, శ్మశాన వాటిక వంటి వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నిధులతో ముందుగా పట్టణ సుందరీకరణతో పాటు, జంక్షన్ అభివృద్ధి, కుమ్మరి కుంట వద్ద పార్కు ఏర్పాటు, పట్టణ రోడ్లకి ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, మోడల్ మార్కెట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నిధులతో చేపట్టే కార్యక్రమాలను అక్టోబర్ నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని, ఈ మేరకు ఆయా కార్యక్రమాలకు టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ గురించి కేటీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట కోసం ప్రత్యేకంగా ఒక డంపు యార్డు ఏర్పాటు చేసుకోవడంతో పాటు స్వచ్ఛ ఆటోలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు. మున్సిపాలిటీ ఆదాయం ఖర్చులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అనేక పురపాలికలు వందశాతం ఆదాయపు పన్ను కలెక్షన్లను సాధించాయని, ఈ ఏడాది అయినా 100% ఆదాయపన్ను లక్ష్యాన్ని చేరుకోవాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. నర్సంపేట పట్టణ అభివృద్ధి, విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అక్రమ లే ఔట్లను ఏ మాత్రం సహించేది లేదని, అలాంటి వాటి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ను ఆదేశించారు.

నర్సంపేట అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.20 కోట్లను కేటాయించడంతో పాటు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేసిన కేటీఆర్ కు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దిశానిర్దేశం చేసిన మేరకు మౌలిక వసతుల కార్యక్రమాలను అక్టోబరు నాటికి పూర్తయ్యేందుకు స్థానిక ప్రజాప్రతినిధులంతా కలిసి ముందుకెళ్తామని చెప్పారు. కేటీఆర్ సూచించిన కార్యక్రమాల శంకుస్థాపన నిమిత్తం ఆగస్టులో నర్సంపేటలో పర్యటించాల్సిందిగా ఆయన్ని సుదర్శన్ రెడ్డి కోరారు. 

  • Loading...

More Telugu News