Andhra Pradesh: ఏపీ చేపలకు తిరుగులేదంతే.. పరీక్షల్లో భేష్!
- ఫార్మాలిన్ అవశేషాల పేరుతో ఏపీ చేపలపై నిషేధం
- అక్కడి అధికారుల సమక్షంలోనే ఏపీ అధికారుల పరీక్షలు
- అవశేషాలు లేవని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ నుంచి అసోంకు ఎగుమతి అవుతున్న చేపలు భేష్ అని ఏపీ మత్స్యశాఖ అదనపు సంచాలకుడు కోటేశ్వరరావు బృందం పేర్కొంది. ఏపీ చేపల్లో ఫార్మాలిన్ అవశేషాలు ఉన్నట్టు గుర్తించిన అసోం దిగుమతులపై నిషేధం విధించింది. అసోం అరోపణలపై నిగ్గు తేల్చేందుకు.. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సిప్ట్) తయారు చేసిన ప్రత్యేక కిట్లతో కోటేశ్వరరావు బృందం అసోం చేరుకుని పరీక్షలు నిర్వహించింది.
అక్కడి అధికారుల సమక్షంలో మొత్తం 9 నమూనాలను పరీక్షించిన ఏపీ బృందం ఎనిమిది నమూనాల్లో ఫార్మాలిన్ అవశేషాలు లేవని తేల్చింది. ఒక్కదాంట్లో మాత్రం కొంత ఆలస్యంగా రంగు మారినట్టు బృందం తెలిపింది. అయితే, దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని అధికారులు పేర్కొన్నారు.
అసోం అధికారుల సమక్షంలోనే ఫార్మాలిన్ అవశేషాలు లేవని తేలడంతో దిగుమతులకు అనుమతించాలని ఏపీ అధికారులు అసోం అధికారులను కోరారు. అయితే, ముందుగా విధించిన పది రోజుల నిషేధం ముగిసిన తర్వాతే నిర్ణయం తీసుకోగలుగుతామని వారు పేర్కొన్నారు.