Patanjali: ఇక పతంజలి కూరగాయలు.. సిద్ధమవుతున్న రాందేవ్ బాబా
- త్వరలో కూరగాయల వ్యాపారంలోకి పతంజలి
- తొలి దశలో ఆరేడు కూరగాయలు
- స్వదేశ్ పేరుతో ఖాదీ ఉత్పత్తులు కూడా
ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్) రంగంలో దూసుకుపోతున్న యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ నుంచి త్వరలో కూరగాయలు కూడా రానున్నాయి. శీతలీకరించిన బఠాణీలను ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విక్రయిస్తున్న పతంజలి ఇప్పుడు కూరగాయలను కూడా ఈ తరహాలో విక్రయించాలని యోచిస్తోంది. దీంతోపాటు ‘స్వదేశ్’ పేరిట ఖాదీ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం రూ.10 వేల కోట్లు వెచ్చించనుంది.
తొలి దశలో క్యారెట్, కాలీఫ్లవర్ వంటి ఆరేడు కూరగాయలతో మార్కెట్లోకి రావాలని పతంజలి నిర్ణయించింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కంపెనీ యూనిట్ల నుంచి కూరగాయలను సేకరించనుంది. ప్రస్తుతం శీతలీకరించిన పండ్లు, కూరగాయల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ.1500 కోట్లకు చేరుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.