Aashadham: భాగ్యనగరంలో మొదలైన బోనాల సంబురం... కిటకిటలాడుతున్న గోల్కొండ మహంకాళి ఆలయం!
- ఆషాఢ మాసం ప్రారంభమైన మరుసటి రోజే ఆదివారం
- తొలి బోనం జగదాంబ మహంకాళికి
- ప్రారంభమైన తొట్టెల ఊరేగింపు
బోనాల సంబురం మొదలైంది. ఆషాఢ మాసం ప్రారంభమైన మరుసటి రోజే ఆదివారం రావడంతో, హైదరాబాద్ గోల్కొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనమెత్తేందుకు నగరం సిద్ధమైంది. "అమ్మా బైలెల్లినాదో... తల్లీ బైలెల్లినాదో.." అంటూ భక్తులు సందడిగా ఆలయానికి చేరుతున్నారు. పోతరాజుల హంగామా, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలు భాగ్యనగర వాసుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
నేడు అమ్మవారికి ప్రభుత్వం తరఫున బోనం సమర్పించనున్నారు. ఈ ఉదయం లంగర్ హౌస్ నుంచి జగదాంబ మహంకాళి చిత్రపఠంతో కూడిన ఘట్టం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమైంది. కోరిన కోర్కెలను తీర్చే తల్లిగా మహంకాళికి గోల్కొండ ప్రాంతంలో ఎంతో పేరుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండగను అధికారికంగా నిర్వహిస్తుండటంతో ఎటువంటి లోపాలు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.