Narendra Modi: ‘ముందస్తు’పై మనసు మార్చుకున్న మోదీ?
- ‘ముందస్తు’పై పునరాలోచనలో కేంద్రం
- షెడ్యూలు ప్రకారమే లోక్‌సభ ఎన్నికలు
- ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే కారణం?
నిన్నమొన్నటి వరకు దేశంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ప్రచారం జరిగింది. ‘వన్ నేషన్-వన్ ఎలెక్షన్’ నినాదం వినిపించింది. అయితే, మళ్లీ ఇప్పుడా మాట వినిపించడం లేదు. షెడ్యూలు ప్రకారం లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. నిన్నమొన్నటి వరకు ముందస్తుకే వెళ్లాలని బీజేపీ నిర్ణయించినా, ప్రస్తుత రాజకీయ పరిణామాలతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి ఈ ఏడాది డిసెంబరులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితోపాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరిపించేస్తే ఓ పనైపోతుందని మోదీ సర్కారు భావించింది. తద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీపై వ్యతిరేకత మరింత పెరగకుండా చూడడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని భావించింది. అయితే, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు మినహా మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికలకు 'నో' చెప్పాయి. ఈ కారణంగానే కేంద్రం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న పలు సర్వేల ఫలితాలు కూడా మోదీ మనసు మార్చుకోవడానికి మరో కారణమైందని చెబుతున్నారు.