BJP: నా భర్త కాలేజీ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.. బీజేపీ ఎమ్మెల్యే భార్య ఆరోపణ

  • భార్య, పిల్లలు ఉండగా మరో యువతితో సంబంధం
  • ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపణ
  • ఆరోపణల్లో నిజం లేదన్న ఎమ్మెల్యే

జమ్ముకశ్మీర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త కాలేజీ అమ్మాయితో సంబంధం పెట్టుకుని, ఆమెను పెళ్లాడాడని ఆరోపించారు. ఆర్ఎస్ పురా నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే గగన్ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత గగన్ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని ఆమెను వివాహం చేసుకున్నాడన్నారు. ఆమె తండ్రి ఆర్మీ మాజీ అధికారి అని తెలిపారు. పంజాబ్‌లోని యువతి చదువుతున్న కాలేజీ నుంచి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని ఆరోపించింది.  

బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా మోనిక అభ్యర్థించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘‘నేను మీ కుటుంబంలోని కుమార్తెగా భావించి న్యాయం కోసం అభ్యర్థిస్తున్నా. ఇది నా కోసమో, నా  పిల్లల కోసమో అడుగుతున్నది కాదు.. ఆ అమ్మాయి వయసు ఇంకా 19 ఏళ్లే’’ అని పేర్కొంది.

మోనిక ఆరోపణలను గగన్ ఖండించారు. తమ మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్టు తెలిపారు. తన నుంచి విడాకులు కావాలని ఆమె అడిగిందని, అయితే, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వద్దని వారించినట్టు చెప్పారు. అందుకే తనపై ఆరోపణలు చేస్తోందని అన్నారు. కాగా, ఈ వివాదంలో జోక్యం చేసుకున్న పార్టీ క్రమ శిక్షణ కమిటీ ఎదుట మోనిక, గగన్ హాజరయ్యారు. మరోవైపు తనపై కుట్ర జరుగుతోందని, ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానని గగన్ సవాలు విసిరారు.

గత నెలలో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కుమార్తెను గగన్ కిడ్నాప్ చేశాడని పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని రక్షించి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ  సందర్భంగా యువతి మాట్లాడుతూ.. గగన్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.

  • Loading...

More Telugu News