Amit shah: అబ్బే! మీ పనితీరు బాలేదు.. ఇలాగైతే అధికారంలోకి రావడం కష్టం!: కార్యకర్తలకు అమిత్ షా క్లాస్
- కార్యకర్తలతో భేటీలో అమిత్ షా అసంతృప్తి
- పనితీరు బాగాలేందంటూ అసహనం
- బలంగా ఉన్న పార్టీ బలహీనంగా మారుతోందని వ్యాఖ్య
తెలంగాణలో బీజేపీ కార్యకర్తల పనితీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పని తీరు ఇలాగే ఉంటే అధికారంలోకి రావడం కష్టమని కాసింత కటువుగా చెప్పారు. శాసనసభ, లోక్సభ నియోజక వర్గాల పూర్తిస్థాయి కార్యకర్తలతో భేటీ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. వివిధ అంశాలతో కూడిన 23 కార్యక్రమాలు అప్పగిస్తే కేవలం 12 మాత్రమే పూర్తి చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.
పోలింగ్ బూత్లు, శక్తి కేంద్రాల కమిటీల ఏర్పాటు ఇప్పటి వరకు పూర్తికాలేదని, ఇక్కడి కంటే ఏపీనే బెటరని అన్నారు. అక్కడ ఏకంగా 45 వేల శక్తి కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. పార్టీ గతంలో బలహీనంగా ఉన్న ఒడిశా, పశ్చిమబెంగాల్లోనూ పార్టీ బలపడుతోందని, కానీ గతంలో బలంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు బలహీన పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచైనా అధిష్ఠానం అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయాలని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.