Congress: కాంగ్రెస్ గెలిచేదీ లేదు.. ఉత్తమ్ గడ్డం తీసేదీ లేదు!: మంత్రి నాయిని విసుర్లు
- కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి నాయిని విమర్శలు
- దేశానికి పనికొచ్చే ఏ ఒక్క మంచి పనీ ప్రధాని మోదీ చేయలేదు
- తెలంగాణలో మరో పదిహేనేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది
కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తన గడ్డం తీసే ప్రసక్తే లేదంటూ నాడు శపథం చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కాంగ్రెస్ పార్టీ గెలిచేదీ లేదు.. ఉత్తమ్ గడ్డం తీసేదీ లేదు’ అని సెటైర్లు విసిరారు.
దేశానికి పనికొచ్చే ఏ ఒక్క మంచి పనీ ప్రధాని మోదీ చేయలేదని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీకే పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని మరోసారి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని చెప్పిన ఆయన, మరో పదిహేనేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.