New Delhi: క్లాస్ రూములో సీసీ టీవీలతో పనేంటి?: ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ టీవీ ఏర్పాటు
- 1.4 లక్షల కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రభుత్వం
- ఎందుకో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశం
ప్రభుత్వ స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1.4 లక్షల కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదన వెనక భద్రతాపరమైన కారణాలు ఉన్నప్పటికీ, పిల్లల చొరవను అది దెబ్బతీసే అవకాశం ఉందని తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి.హరి శంకర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అంతేకాక దీనివల్ల చిన్నారుల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. అయితే, కొన్ని కేసుల్లో మాత్రం సీసీటీవీలు అవసరమేనని పేర్కొంది. ఉపాధ్యాయులు క్లాసు రూములో ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలా బోధిస్తున్నారన్నది తెలుసుకునే వీలుందని పేర్కొంది. అయితే, తాజా కేసులో కెమెరాల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం, అందుకు దారి తీసిన పరిస్థితులపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.