Daggubati: రాజకీయాల్లోకి ఎన్టీఆర్ మనవడు హితేష్... ఏ పార్టీ అన్నదే తేల్లేదట!
- దగ్గుబాటి దంపతుల తనయుడు హితేష్ చంచూరామ్
- 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ
- ఏ పార్టీయో తేల్చుకోలేక పోతున్న పురందేశ్వరి, వెంకటేశ్వరరావు
ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో రాజకీయ నేత రానున్నారు. తమ రాజకీయ వారసుడిగా కుమారుడు హితేష్ చెంచురామ్ ను నిలపాలని భావిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు ఏ పార్టీ నుంచి అతన్ని పోటీ చేయించాలా? అన్న విషయాన్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదని దగ్గుబాటి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అల్లుడిగా, మాజీ మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి, ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పురందేశ్వరి మాత్రం గతంలో కాంగ్రెస్ లో, ప్రస్తుతం బీజేపీలో ఉంటూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక తమ కుమారుడు హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి అసెంబ్లీకి నిలపాలని భావిస్తున్న వీరిద్దరూ, ఏ పార్టీ నుంచి పోటీకి దింపాలన్న విషయమై నిర్ణయం తీసుకోలేదట.
బీజేపీ నుంచి హితేష్ ను బరిలోకి దింపడానికి పురందేశ్వరికి ఆటంకం ఏమీ లేనప్పటికీ, గెలుపు అవకాశాలు చాలా స్వల్పంగా ఉంటాయని ఈ దంపతులు భావిస్తున్నారట. తమ కుటుంబాల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నా, పిల్లల ఎదుగుదలపై అటువంటి ప్రభావం పడేలా భువనేశ్వరి, పురందేశ్వరిలు వ్యవహరించక పోవడంతో, లోకేష్, హితేష్ ల మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని దగ్గుబాటి అనుచరగణం వ్యాఖ్యానిస్తోంది. అదే జరిగితే పురందేశ్వరి బీజేపీలో కొనసాగే అవకాశం ఉండదు. మరోపక్క, అటు వైకాపా, ఇటు కాంగ్రెస్ కూడా హితేష్ పట్ల సానుకూలంగానే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్ లో ఉన్న హితేష్ చెంచురామ్ ఏ పార్టీ వైపు వెళతారో త్వరలోనే తేలుతుంది.