Uttam Kumar Reddy: అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం
- పంచాయతీ ఎన్నికల విషయమై ప్రభుత్వం తప్పులు చేస్తోంది
అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని, రిజర్వేషన్లపై తప్పిదాలను ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న కారణంగానే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లు రైతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని, క్వింటా వరికి రూ.2000, పత్తికి రూ.6000, సోయాబీన్ కు రూ.3500, కందులకు రూ.7000, మిర్చికి రూ.10 వేలు, పసుపుకు రూ.10 వేలు, ఎర్రజొన్నలకు రూ.3 వేలకు తక్కువ కాకుండా ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు.
మార్కెట్ కి వచ్చే ప్రతి గింజను దగా చేయకుండా కొనుగోలు చేస్తామని, క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొస్తామని, నిరుద్యోగులందరూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు తగిన సమాధానం చెప్పాలని, ‘మేము అధికారంలోకి వస్తున్నాం..నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.