Burari: బురారీ డెత్ మిస్టరీ: డైరీలో మరో విస్తుగొలిపే విషయం!
- ఎవరో చేసిన తప్పుకు మేం శిక్ష అనుభవిస్తున్నాం
- వచ్చే ఏడాది ఆ పండుగ జరుపుకోకపోవచ్చు
- సామూహిక ఆత్మహత్యల కేసులో మరో ట్విస్ట్
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగిన సామూహిక ఆత్మహత్యల కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. లలిత్ భాటియా ఇంటి నుంచి పోలీసులు ఇప్పటికే కొన్ని డైరీలు స్వాధీనం చేసుకోగా, బుధవారం వారికి మరో డైరీ లభించింది. భాటియా తన కుటుంబానికి సంబంధించి అన్ని విషయాలను అందులో క్షుణ్ణంగా రాసుకున్నారు.
తాజాగా లభించిన డైరీలో గతేడాది నవంబరు 11న రాసినది చూసి పోలీసులు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో ఇలా రాసి ఉంది.. ‘ఎవరో చేసిన తప్పులకు మేం శిక్ష అనుభవిస్తున్నాం. బహుశా మాకు ఇదే చివరి ధన్తేరాస్, దీపావళి కావచ్చు. వచ్చే ఏడాది వీటిని జరుపుకోకపోవచ్చు’’ అని భాటియా రాసుకొచ్చారు. ఈ రాతలను బట్టి చూస్తే ఆత్మహత్యలకు వారు ఏడాది, ఇంకా ముందునుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.
ఈ నెల 1వ తేదీన వెలుగులోకి వచ్చిన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మోక్షం కోసం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకే రోజు ఒకే సమయంలో, ఒకే విధంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో చిక్కుముడి ఇంకా వీడడం లేదు. రోజుకో ట్విస్ట్ బయటపడుతుండడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.