ntr: అన్నగారు అంతగా ఎదురుచూస్తారని అనుకోలేదు .. ఉద్వేగానికిలోనైన పరుచూరి గోపాలకృష్ణ
- ఎన్టీఆర్ మా కోసం కారు పంపించారు
- ఆ సమయంలో మేము ఇంట్లో లేము
- తరువాత నెలలో ఆయనను కలిశాము
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ నన్ను రాజకీయాల్లోకి రమ్మని అన్నారు .. నేను నా పరిస్థితి గురించి వివరిస్తే .. 'సరే మీ ఇష్టం' అన్నారు. ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజున పరుచూరి వెంకటేశ్వర రావు ఇంటికి 9999 అంబాసిడర్ కారు వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో మా అమ్మానాన్నలే వున్నారు.
ఎన్టీ రామారావు గారు మమ్మల్ని తీసుకు రమ్మన్నట్టుగా వచ్చినవాళ్లు చెప్పారట. మద్రాసులో ఒకరు .. ఢిల్లీలో ఒకరు ఉన్నారని అమ్మానాన్నలు చెప్పడంతో కారు వెళ్లిపోయింది. ఆ తరువాత నెలలో నేను హైదరాబాద్ వచ్చాను. నేను వున్న చోటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి అన్నగారు రమ్మంటున్నట్టుగా చెప్పారు. నేను సిటీకి వచ్చిన సంగతి ఆయనకి ఎలా తెలుసు అని అడిగితే .. ఎయిర్ పోర్టులోనే మనిషిని పెట్టినట్టుగా చెప్పారు.
మా అన్నయ్యను కూడా తీసుకుని వెళ్లాను .. మమ్మల్ని చూడగానే అన్నగారు 'మీటింగ్ కి ఎందుకు రాలేదు ..' అని అడిగారు. 'మేం మీ కోసం ఎంతగా ఎదురుచూశామో మీకేం తెలుసు? నా రాజకీయ జీవితంలో కొన్ని అక్షరాలు మీవి కూడా వున్నాయి కదా .. మీరు ఉండాల్సింది' అంటూ ఉండగా ఆయన గొంతు మూగబోయింది. రాలేకపోయినందుకు క్షమించండి అన్నగారు అన్నాను. ఆయన అంతగా ఎదురుచూస్తున్నట్టుగా ఎవరి ద్వారా తెలిసినా వెళ్లి ఉండేవాడిని అంటూ పరుచూరి గోపాలకృష్ణ ఉద్వేగానికి లోనయ్యారు.