Congress: డీఎస్ మళ్లీ ‘కాంగ్రెస్’లోకి వస్తామంటే మేం ఒప్పుకోం: వీహెచ్
- నాడు ‘కాంగ్రెస్’ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని డీఎస్ వీడారు
- కేసీఆర్ కు బీసీలంటే ప్రేమే లేదు
- వారి ఓట్లు మాత్రం కావాలి
టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్)పై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు వేటు వేయాలంటూ సీఎం కేసీఆర్ కు ఇటీవల ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కేసీఆర్ ని కలిసేందుకు డీఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీఆర్ఎస్ లో డీఎస్ ను ఎవరూ పట్టించుకోకపోతుండటంతో తిరిగి సొంత పార్టీ గూటికే చేరాలని డీఎస్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ను మీడియా ప్రశ్నించగా, తనదైన శైలిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. డీఎస్ మళ్లీ ‘కాంగ్రెస్’లోకి వస్తామంటే తాము ఒప్పుకోమని, నాడు ‘కాంగ్రెస్’ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి ఆయన వెళ్లారని విమర్శించారు. ‘ఒకవేళ డీఎస్ ను ‘కాంగ్రెస్’లోకి తీసుకున్నా.. కేసీఆర్ మళ్లీ పిలిచి ‘శీనన్న’ అంటే చాలు కేసీఆర్ కు డీఎస్ భజన చేస్తారు’ అంటూ సెటైర్లు వేశారు. అందుకే, డీఎస్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలో, వద్దో ఓసారి పార్టీ నేతలు ఆలోచించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా వీహెచ్ విమర్శలు చేశారు. కేసీఆర్ కు బీసీలంటే ప్రేమ లేదు కానీ, వారి ఓట్లు మాత్రం కావాలని మండిపడ్డారు.