Pakistan: లండన్ వీధుల్లో నవాజ్ షరీఫ్ కు ఘోర అవమానం... తిడుతూ, దాడికి ప్రయత్నించిన నిరసనకారులు!
- లండన్ లో కుమారుడి వద్ద ఉన్న నవాజ్ షరీఫ్
- ఆయన ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు
- నవాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు
పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయి, ప్రస్తుతం లండన్ లోని తన కుమారుడి నివాసంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఘోర అవమానం ఎదురైంది. ఇక్కడి అవెన్ ఫీల్డ్ హౌస్ లో ఉంటున్న ఆయన నివాసాన్ని చుట్టుముట్టిన కొందరు నిరసనకారులు ఆ ఇంటి తలుపులను తన్నుతూ, అక్కడున్న ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. నవాజ్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
ఆదివారం నాడు ఈ ఘటన జరుగగా, పాకిస్థాన్ మీడియా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇందుకు సంబంధించిన వీడియోను 'డాన్', 'జియో న్యూస్' విడుదల చేశాయి. నవాజ్ కు సాయంగా ఉన్న ఓ భద్రతా అధికారిని సైతం నిరసనకారులు టార్గెట్ చేసుకుని కొట్టేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపిస్తోంది.
కాగా, ఈ ఘటనపై స్పందించిన నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యామ్ నవాజ్.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలే ఈ దారుణానికి దిగారని ఆరోపించారు. లండన్ లోని తన పార్టీ మద్దతుదారులతో ఆయన దాడి యత్నం చేశారని అన్నారు. ఇదిలావుండగా, ఈ దాడికి దిగింది ఏ పార్టీ వారూ కాదని, నవాజ్ పై ఆగ్రహంతో ఉన్న పాక్ సంతతి ప్రజలే కొందరు దాడి చేశారని డాన్ న్యూస్ వెల్లడించింది. ఇస్లామాబాద్ కోర్టు నవాజ్ షరీఫ్ కు 10 సంవత్సరాల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.