Congress: ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతంపై దృష్టి.. త్వరలో ఏకంగా 44 వేల బూత్ స్థాయి కమిటీల నియామకం: ఊమెన్ చాందీ

  • సెప్టెంబర్ 30లోపు బూత్‌ స్థాయి కమిటీలన్న ఊమెన్‌ చాందీ 
  • జమిలి ఎన్నికలపై తన నిర్ణయం ఏమీ ఉండదన్న రఘువీరారెడ్డి
  • ఆ అంశంపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య

మొట్ట మొదటిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 44 వేల బూత్ స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపుగా  ఏపీలో వీటి ఏర్పాటు పూర్తవుతుందని ఏపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ తెలిపారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు ఆయన కృష్ణాజిల్లా పెన‌మ‌లూరులో జిల్లా కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 9 నుంచి 31 వ‌ర‌కు రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అన్ని జిల్లాలకు తిరిగి పార్టీ స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకోవడంలో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లా వచ్చామని అన్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి మీద సమీక్షలు మొదలు పెట్టామని, ఈ నెల 31వ వరకు ఇవి కొనసాగుతాయని అన్నారు.

ఇందులో విశాఖకి మాత్రం రెండు రోజులు కేటాయిస్తామని రఘువీరారెడ్డి అన్నారు. పార్టీ బలోపేతం, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. జమిలి ఎన్నికల గురించి ఏపీసీసీ అధ్యక్షుడిగా తన నిర్ణయం ఏముండదని.. ఆ అంశంపై ఏఐసీసీ మాత్రమే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 19 వ‌ర‌కు ఇంటింటికి కాంగ్రెస్, ఇందిరా గాంధీ సంస్మరణ కార్యక్రమాల పేరుతో ప్రచారం చేయబోతున్నామని తెలిపారు. 

  • Loading...

More Telugu News