Kidnap: భార్యను కాపురానికి పంపించాలంటూ, బావమరిది కుమారుడి కిడ్నాప్!
- కృష్ణతో గొడవపడి విడిపోయిన భార్య
- ఆమెను పంపించాలంటూ కిడ్నాప్
- కేసును విచారిస్తున్న మొయినాబాద్ పోలీసులు
తన భార్యను కాపురానికి పంపించాలని డిమాండ్ చేస్తూ, బావమరిది రెండేళ్ల కొడుకును కిడ్నాప్ చేశాడో కూలీ. హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వికారాబాద్ ప్రాంతానికి చెందిన బస్వరాజ్, అనితలు తమ 20 నెలల కుమారుడు హర్షతో కలసి హైదరాబాద్ పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్’లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.
పది రోజుల క్రితం బస్వరాజ్ బావ కృష్ణ వచ్చి, తనకూ పని చూపాలని కోరాడు. అప్పటికే కృష్ణతో గొడవ పడిన అతని భార్య, బస్వరాజ్ చెల్లెలు భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు అందరూ పనిలో ఉండగా, బస్వరాజ్ బిడ్డను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కృష్ణ, కుమారుడిని తిరిగి అప్పగించాలంటే, తన భార్యను కాపురానికి పంపాలని డిమాండ్ చేశాడు. తాను తాండూరులో ఉన్నానని చెప్పడంతో, హుటాహుటిన అక్కడికి వెళ్లిన బస్వరాజ్ కు కృష్ణ కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణను అరెస్ట్ చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు మొయినాబాద్ పోలీసు అధికారులు వెల్లడించారు.