Nirbhaya: ఆరేళ్ల నాటి 'నిర్భయ' కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు!

  • 2012 డిసెంబర్ 16న ఘటన
  • కదులుతున్న బస్సులో దారుణంగా అత్యాచారం
  • నలుగురి భవిష్యత్తును తేల్చనున్న సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అత్యాచారాలపై కఠిన చట్టాలను తేవడానికి కారణమైన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు నేడు తుదితీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే కింది కోర్టులు దోషులకు ఉరిశిక్షను విధించిన నేపథ్యంలో, సుప్రీం కూడా ఉరిశిక్షనే ఖరారు చేస్తుందా? అన్న విషయం నేడు తేలనుంది. 2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై ఓ మైనర్ సహా ఆరుగురు అత్యంత పాశవికంగా అత్యాచారం జరపగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె, డిసెంబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే.

 తన స్నేహితుడితో కలసి సినిమా చూసి తిరిగి వస్తుండగా, కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఆమె పేగులకు కూడా గాయాలు అయ్యేంత కిరాతకంగా ప్రవర్తించారు దుర్మార్గులు. ఈ అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. ప్రజల నిరసనలు ప్రభుత్వం దిగివచ్చేలా చేశాయి. 'నిర్భయ' పేరిట కఠిన చట్టాలు వచ్చాయి.

ఈ కేసులో బస్ డ్రైవర్ రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, అతని తమ్ముడు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ లకు సెషన్స్ కోర్టు 2013, సెప్టెంబర్ 13న ఉరిశిక్ష విధించింది. హైకోర్టు కూడా దీనిని ధ్రువీకరించింది. మైనర్ బాలుడు రాజును జువైనల్ యాక్ట్ ప్రకారం విచారించారు. ఇక ఈ కేసులో తుది వాదనలు విన్న సుప్రీం నేడు తీర్పు ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News