Jharkhand: మదర్ థెరీసా చారిటీ హోమ్స్‌లో ఘోరం.. పెద్ద ఎత్తున పిల్లల అక్రమ రవాణా?
- మదర్ థెరీసా చారిటీలో పిల్లల అక్రమ రవాణా?
- జార్ఖండ్‌లో నవజాత శిశువుల కుంభకోణం
- పెద్ద సంఖ్యలో కనిపించని పిల్లల రికార్డులు
పిల్లలు లేని వారికి చిన్న పిల్లలను విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషనరీస్ ఆఫ్ చారిటీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 280 మంది చిన్నారులకు సంబంధించి రికార్డులు మాయమయ్యాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో చారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ హోమ్స్‌లో జన్మనిచ్చిన 280 మంది మహిళలకు సంబంధించి రికార్డులు కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. సెయింట్ థెరీసా స్థాపించిన చారిటీ ఆధ్వర్యంలోని వివిధ హోమ్స్‌లో 2015 నుంచి 2018 మధ్య 450 మంది గర్భిణులు చేరారు. అయితే వీరిలో కేవలం 170 మందికి సంబంధించిన రికార్డులు మాత్రమే ఉండగా, 280 మంది రికార్డులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును అన్ని కోణాల నుంచి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రికార్డుల్లోనూ వ్యత్యాసాలు ఉన్నట్టు గమనించినట్టు దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.
చారిటీ హోం నుంచి ఈ ఏడాది మేలో ఓ జంట నవజాత శిశువును తీసుకుంది. ఇందుకోసం తాము చారిటీకి రూ.1.20 లక్షలు చెల్లించామని, అయితే, కోర్టు ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం తిరిగి శిశువును అప్పగిస్తామని వారు చెప్పి, ఆ ప్రకారం బిడ్డను వారికి ఇవ్వకపోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఆ తర్వాత మరికొంతమంది ఇటువంటి ఫిర్యాదులే చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారుల అక్రమ రవాణా జరుగుతోందని అనుమానించారు. దర్యాప్తులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. 280 మంది చిన్నారులకు చెందిన రికార్డులు కనుమరుగవడం పోలీసుల అనుమానాలను మరింత పెంచింది.