Jan Dhan: జన్‌ధన్ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం!
- జన్ ధన్ ఖాతాదారులకు ఉచిత బీమా
- ఆగస్టు 15 నుంచి అమల్లోకి
- 50 కోట్ల మందికి లబ్ధి
జన్‌ధన్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి పది కోట్ల కుటుంబాల (సుమారు 50 కోట్ల మంది)కు ఉచిత బీమా అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా వారందరినీ ఉచిత ప్రమాద బీమా పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. పంద్రాగస్టు రోజున మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే, ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు విధివిధానాలు వెల్లడి కాలేదు. అయితే, జన్ ధన్ ఖాతాలతో ఈ పథకానికి సంబంధం ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో 32 కోట్ల మంది జన్ ధన్ ఖాతాదారులుండగా, వీరిలో రూపే కార్డు వాడుతున్న వారి సంఖ్య 24 కోట్లు. వీరంతా ఇప్పటికే బీమా పరిధిలో ఉన్నారు. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న సురక్ష పాలసీని జన్ ధన్ ఖాతాదారులకు అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి కేవలం రూ. 12 ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది. ఇప్పుడా రూ.12 లను జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే, ఇందుకోసం మూడు నెలల వ్యవధిలో ఒకసారైనా రూపే కార్డును వినియోగించాల్సి ఉంటుంది.