samantha: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత.. షికారు కొడుతున్న వార్త
- ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న సమంత
- భర్త నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం
- కొత్త సినిమాలు ఒప్పుకోని అక్కినేనివారి కోడలు
దక్షిణాది అగ్ర సినీ నటి సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందనే వార్త షికార్లు కొడుతోంది. గతంలోనే దీనికి సంబంధించి సమంత క్లారిటీ ఇచ్చింది. సినిమాలను ఇప్పట్లో ఆపేయాలనే ఆలోచన తనకు లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే, ఏడాది తర్వాత ఆమె సినిమాలకు దూరమవబోతోందంటూ కొత్త వార్త తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం ఆమె చాలా బిజీగా ఉంది. తమిళంలో సూపర్ డీలక్స్, సెమ్మ రాజా, తెలుగులో యూటర్న్ రీమేక్ చిత్రాలలో నటిస్తోంది. నాగచైతన్యతో కలసి ఓ సినిమాలో నటించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇవి కాకుండా కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోవడం లేదని... 2019 మార్చి కల్లా ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి, సినిమాలకు గుడ్ బై చెప్పాలనేది ఆమె ఆలోచన అని అంటున్నారు. ఈ వార్తపై సమంత స్పందించాల్సి ఉంది.