Maharashtra: సచివాలయంలో పోలీసు భార్య హల్ చల్.. అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు
- సెక్రటేరియట్‌లో పోలీసుల భార్యల సంఘం అధ్యక్షురాలు
- వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లి నినాదాలు
- అవాక్కైన పోలీసులు
పోలీసుల భార్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వెళ్లిన ఆ సంఘం అధ్యక్షురాలు ఒక్కసారిగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హల్ చల్ చేశారు. దీంతో విస్తుపోయిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో సెక్రటేరియట్‌లో జరిగిందీ ఘటన.
మహారాష్ట్ర పోలీసు భార్యల సంఘానికి యశశ్రీ పాటిల్ అధ్యక్షురాలు. చాలాకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. దీంతో ‘మంత్రాలయానికి’ వెళ్లిన ఆమె వినతి పత్రం సమర్పించి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. అప్పటి వరకు శాంతమూర్తిలా మౌనంగా ఉన్న ఆమె అక్కడి నుంచి నేరుగా మూడో అంతస్తుకి చేరుకుని విశ్వరూపం ప్రదర్శించారు. ‘వందేమాతరం’, ‘జై కిశాన్’ అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ నానా యాగీ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. ఏ జరుగుతోందో తెలియక పోలీసులు అయోమయానికి గురయ్యారు. తర్వాత తేరుకుని ఆమెను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఆమెను విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు.