Andhra Pradesh: ఏపీలో ఆ నలుగురు మంత్రులు ఎన్నికల గోదాలోకి దిగుతారా?.. రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ!

  • వచ్చే ఎన్నికల్లో లోకేశ్, యనమల, సోమిరెడ్డి, నారాయణ పరిస్థితి ఏమిటి?
  • ఎమ్మెల్సీలుగా కొనసాగుతారా?
  • ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా?

ఏపీ మంత్రులు నారా లోకేశ్, యనమల, సోమిరెడ్డి, పి.నారాయణ.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వీరిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వీరు ఏం చేయబోతున్నారు? ఎన్నికల బరిలోకి దిగుతారా? లేదంటే ఎమ్మెల్సీలుగానే కొనసాగుతారా? అన్నదే చర్చ. ఎమ్మెల్సీలైన ఈ నలుగురి పదవీ కాలం ఇంకా చాలా కాలం ఉంది. దీంతో ఇప్పుడు ఏం చేయబోతున్నారనే చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నలుగురిలో నారా లోకేశ్, నారాయణలు ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేదు. సోమిరెడ్డి, యనమల గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. యనమల అయితే, గత ఎన్నికలకు ముందు నుంచే ఎమ్మెల్సీగా ఉన్నారు.

గత ఎన్నికల నుంచి లోకేశ్ పార్టీలో చురుగ్గా ఉంటున్నారు. దీంతో తాను కూడా ఎన్నికల బరిలో నిలిస్తే పర్యవేక్షణ కుదరదన్న అభిప్రాయంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయి, మంత్రి పదవి చేపట్టారు. గత ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోగా, ఎమ్మెల్సీగా ఉన్న యనమల ఆర్థికమంత్రి అయ్యారు. మధ్యలో సోమిరెడ్డి ఎమ్మెల్సీ అయి కేబినెట్‌లో చేరారు.

ఇక వచ్చే ఎన్నికల్లో గతంలో తాను పోటీచేసిన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచే మళ్లీ బరిలోకి దిగాలని సోమిరెడ్డి దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు. మంత్రి నారాయణ మాత్రం ఇంకా డైలమాలో ఉన్నారు. నెల్లూరు నగర అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని తొలుత భావించారు. అయితే, ఆ సీటును మైనారిటీలకు కేటాయించే అవకాశం ఉండడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. వీలైతే రూరల్ నుంచి పోటీ చేయాలన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఆయనను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపకుండా ఎమ్మెల్సీగానే ఉంచడం మేలనేది పార్టీలోని మరికొందరి భావన. లోకేశ్ మాత్రం ఏదైనా వెనకబడిన ప్రాంతాన్ని ఎంచుకుని పోటీ చేయాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News