Pawan Kalyan: తక్కువ సినిమాలే చేసినా.. 100 సినిమాలు చేసిన ఇమేజ్ నాకు వచ్చింది: పవన్ కల్యాణ్
- నేను నటుడిని అవ్వాలని అనుకోలేదు
- చాలా తక్కువ సినిమాలు చేసినా భగవంతుడి కృప వల్లే ఈ ఇమేజ్
- ఏమీలేని స్థాయి నుంచి రూ.25 కోట్లు పన్నులు కట్టే స్థాయికొచ్చాను
- నాకు డబ్బు అవసరం లేదు, సమతుల్యత, శాంతి కావాలి
ప్రాంతాలు, జాతులు, కులాల కలయికే భారతదేశమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య తగాదాలు, జాతుల మధ్య వైరాలు సృష్టిస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలోని పాండు రంగాపురం వైట్‌హౌస్‌లో ఆయన ఈరోజు ఓ సమావేశం ఏర్పాటు చేశారు.
విశాఖలో నివసిస్తోన్న ఉత్తర భారతీయుల సమస్యలను గురించి తెలుసుకున్నారు. వైజాగ్ ఫ్లైవుడ్ అసోసియేషన్, రాజస్థాన్ సంస్కృతి మండల్, రాజస్థాని మహిళా సమితి, అగర్వాల్ మహాసభ సమాజ్తో పాటు పలు అసోసియేషన్ల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. మనది వసుదైక కుటుంబమని, మన సంస్కృతిని మార్చేందుకు చాలా మంది యూరోపియన్లు ప్రయత్నించారని, కానీ వాళ్లే మారిపోయారని అన్నారు.
భారతీయతను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ తమదేనని, దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. 2014లో టీడీపీకి తాను మద్దతు ఇస్తే, అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు విశాఖలో భూకబ్జాలు చేస్తున్నారని, కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నారని అన్నారు. తాను సినిమాల్లో సంపాదించి, రాజకీయ పార్టీ పెట్టి మళ్లీ ప్రజలకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు.
తాను నటుడిని అవ్వాలని అనుకోలేదని, కానీ అయ్యానని, చాలా తక్కువ సినిమాలు చేసినా భగవంతుడి కృప వల్ల 100 సినిమాలు చేసిన ఇమేజ్ వచ్చిందని పవన్ అన్నారు. ఏమీలేని స్థాయి నుంచి రూ.25 కోట్లు పన్నులు కట్టే స్థాయికి వచ్చానని అన్నారు. తనకు డబ్బు అవసరం లేదని, సమతుల్యత, శాంతి కావాలని అన్నారు. అందుకే తాను 'అజ్ఞాతవాసి' సినిమా ఫెయిల్ అయినా తిరిగి డబ్బులు ఇచ్చేశానని అన్నారు.