Venkaiah Naidu: తెలుగు సినిమా గుండెచప్పుడు ఎస్వీఆర్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • రవీంద్రభారతిలో ఎస్వీ రంగారావు శతజయంతి ఉత్సవాలు
  • ఎస్వీ రంగారావు పాత్రలకే ఛాలెంజ్ విసిరారు
  • నట యశస్వి, విశ్వనట చక్రవర్తి.. అన్ని బిరుదులు ఆయన నటన కంటే చిన్నవే: వెంకయ్యనాయుడు

ఎన్టీఆర్, ఏయన్నార్ లు తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లు అయితే, ఆ తల్లి గుండె, తెలుగు సినిమా గుండె చప్పుడు ఎస్వీ రంగారావు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘ఇక్కడ నేను మాట్లాడబోతోంది ఒక వ్యక్తి గురించి కాదు.. వందేళ్ల చరిత్ర గురించి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక నటుడి గురించి కాదు..శతాబ్దం పూర్తి చేసుకున్న నటయశస్వి గురించి. నట యశస్వి, విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ.. ఇలా అన్ని బిరుదులు ఆయన నటన కంటే చిన్నవే అన్నట్టు ఎస్వీ రంగారావు ఠీవీగా కనిపిస్తారు. ఎస్వీఆర్ ది స్ఫుర ద్రూపం, ఆకట్టుకునే ఆహార్యం..ఇలా ఆయన నటనలో అణువణువూ ప్రత్యేకమే.. సాధారణంగా ప్రతినాయకుడి పాత్రలో ఏ నటుడిని చూసినా వారి పట్ల మనకు తెలియకుండానే మనసులో వ్యతిరేక భావన మొదలౌతుంది. కానీ, ఎస్వీఆర్ లాంటి వారిని రావణుడిగా, కీచకుడిగా, కంసునిగా..ఇలా ఏ పాత్రలో చూసినా ఓ రకమైన భక్తిభావం కలుగుతుంది. దానికి కారణం ఆయన రూపం, వాచకం, పాత్రలో జీవించే స్వభావం. ఓ విధంగా చెప్పాలంటే ఎస్వీ రంగారావు పాత్రలకే ఛాలెంజ్ విసిరారు. తనదైన శైలిలో నటించి, మెప్పించి.. ‘ఔరా’ అనిపించారు. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలకు జీవం పోశారు’ అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News