punetha: కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలి: ఏపీ ఇంఛార్జి సీఎస్
- వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనిల్ చంద్ర పునేఠ
- కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలు అందాలి
- రుణ అర్హత కార్డులు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ సహాయం అందించేందుకు వీలుగా జిల్లాల వారీగా కేటాయించిన కౌలు రైతుల రుణ అర్హత కార్డులు (ఎల్ఈసీ) జారీ లక్ష్యాన్ని పూర్తిగా అధిగమించాలని జాయింట్ కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులను ఏపీ ఇంఛార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు. సాదా బీమా, కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ, ఆర్డీఓ, తహసిల్దార్ కార్యాలయాల సొంత భవనాల నిర్మాణం, భూదార్, సర్వే సంబంధిత సమస్యలు తదితర అంశాలపై ఈరోజు అమరావతి సచివాలయం నుండి జిల్లా సంయుక్త కలెక్టర్లు, డీఆర్ఓలు, ఆర్డీఓలతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పునేఠ మాట్లాడుతూ, కౌలు రైతులందరికీ బ్యాంకు రుణాలు అందేందుకు వీలుగా, అర్హులైన కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయించిన ఎల్ఈసీ కార్డులు పంపిణీ లక్ష్యాలను అధిగమించాలని స్పష్టం చేశారు.
ఎల్ఈసీ కార్డుల జారీకి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలు మిగతా జిల్లాల కంటే ముందున్నాయని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు 2 లక్షల 10 వేల కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం కాగా, నూరు శాతం కార్డులు పంపిణీ చేయడంపై అభినందనలు తెలిపారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లాలో లక్షా 16 వేల ఎల్ఈసీ కార్డులు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, సుమారు లక్ష కార్డులు ఇచ్చారు,
మిగతా కార్డులు కౌలు రైతులకు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు.
సాదా బీమా కార్యక్రమానికి సంబంధించి పునేఠ మాట్లాడుతూ, ఇందుకు సంబంధించి 45 రోజుల్లోగా మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది కనుక రెండు మూడు రోజుల్లోగా మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరణకు అవసరమైన సాప్ట్ వేర్ సౌకర్యాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిపై అన్ని గ్రామాల్లో వీ ఆర్ఓలు దండోరా వేయించి సాదా బీమాపై ప్రజలందరికీ పూర్తి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
ఈ దరఖాస్తుల స్వీకరణలో వీఆర్ఓలు కీలకపాత్ర పోషించాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నందున ఆయా నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జేసీలను ఆదేశించారు. అనంతరం సర్వే సంబంధిత సమస్యలు, 22ఏ గ్రీవియెన్స్ పిటిషన్లు తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ, గత ఏప్రిల్ నుండి అమలు చేస్తున్న చంద్రన్న పెళ్లి కానుక పథకం అమలుకు సంబంధించి అర్హులైన జంటలకు ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూడాలని రెవెన్యూ అధికారులను కోరారు. రాష్ట్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు శాఖ కమిషనర్ సిహెచ్.విజయమోహన్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ నాటికి అన్ని మండలాల్లో భూధార్ జనరేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం ప్రతి జిల్లాలో కొన్ని మండలాల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా దీనిని చేపట్టామని, భూదార్ పై జిల్లాల్లో తహసిల్దార్లు, ఇతర సాంకేతిక సిబ్బందికి తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఆర్ అండ్ ఆర్ కమిషనర్ జి.రేఖారాణి మాట్లాడారు. ఈ సమావేశంలో సీసీఎల్ఏ కార్యదర్శి శారదాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.