Congress: మానస సరోవర్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగువారిని వెంటనే ప్రభుత్వం రక్షించాలి!: ఏపీసీసీ
- కైలాస్ మానస సరోవర్ యాత్రికులను ఆదుకోవాలి
- రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపాలి
- యాత్రికులను రక్షించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా?
- యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి
కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి నేపాల్-చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయిన ఆంధ్రులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యుడు కొలనుకొండ శివాజీ ఆరోపించారు. ఈరోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ... "కొన్నేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ప్రత్యేక విమానాలను పంపించి నానా హడావుడి చేసిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు... ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ఆ స్థాయిలో స్పందించడం లేదు?
ఆహారం అందక, అనారోగ్యం బారిన పడి అక్కడి బేస్ క్యాంపులలో దుర్భర పరిస్థితిలో ఉన్న యాత్రికులను రక్షించేందుకు సత్వరం తగు చర్యలు చేపట్టకుండా ఏపీభవన్ అధికారులతో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సమస్య తీవ్రతను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు వివరించి తక్షణమే నేపాల్ కు ప్రత్యేక విమానాలు పంపే విధంగా ఏర్పాట్లు చేయాలి. బాధితులను సత్వరం సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఆహారం, వైద్య సాయం అందించేలా చూడాలి.
సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి సహా ఉన్నతాధికారుల బృందాన్ని వెంటనే ఢిల్లీకి పంపించాలి. ఇటీవలి కాలంలో ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీ సర్కారును వెనకేసుకొస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు.. తెలుగువారు చావుబతుకుల్లో ఉంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తున్నా. మొత్తంగా మూడువేల మంది భారతీయులు యాత్రలో చిక్కుపడిపోయినా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణం.
వందల కోట్ల రూపాయలు తగలేసి ప్రత్యేక విమానాలలో ప్రపంచ దేశాలను చుట్టి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? కష్టంలో వున్న భారతీయ యాత్రీకులను రక్షించే బాధ్యత కేంద్రప్రభుత్వానికి లేదా? యుద్ధ ప్రాతిపదికన భారతీయులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో టూర్ ప్లాన్ చేసి, యాత్రీకుల వద్ద అయినకాడికి డబ్బు గుంజి, కష్టకాలంలో చేతులెత్తేస్తున్న టూర్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.