Tollywood: ఆ సమస్య తీరేది కాదు... 'క్యాస్టింగ్ కౌచ్'పై దగ్గుబాటి సురేష్ బాబు!

  • డ్రగ్స్, సెక్స్ మానవ సంబంధిత సమస్యలు
  • గ్లామర్ ఫీల్డ్ కాబట్టే టాలీవుడ్ ముందు కనిపిస్తోంది
  • అన్ని రంగాల్లో ఉన్న సమస్యలే ఇవి
  • టాలెంట్ ఉంటే ఎవరూ అడ్డుకోలేరు
  • నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు

డ్రగ్స్, సెక్స్ అనేవి మానవ సంబంధిత సమస్యలని, ప్రతి రంగంలోనూ ఉంటాయని, అయితే, గ్లామర్ ఫీల్డ్ కాబట్టే చిత్ర పరిశ్రమ ముందుగా కనిపిస్తోందని సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సమస్య అన్ని చోట్లా ఉన్నదేనని, తీరేది కాదని, ఎక్కడో ఒకచోట ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

తనకు తెలిసినంతవరకూ అతి కొద్ది ఘటనలు మాత్రమే టాలీవుడ్ లో జరిగి ఉంటాయని, వాటినే పెద్దవిగా చూపుతున్నారని ఆయన అన్నారు. హ్యూమన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయలేమని వ్యాఖ్యానించారు. తాము మరింతగా కష్టపడాలని భావిస్తూ, కొన్ని రకాల ఉత్ప్రేరకాలను తీసుకునే నటులు, రైటర్లు, డైరెక్టర్లను ఎవరూ ఆపలేరని, అలాంటి వారికి టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వబోమని స్పష్టం చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. కొంతమంది మాత్రమే ఈ పని చేస్తుంటారని, ఇదే సమయంలో ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ టాలీవుడ్ లో ఉన్నారని అన్నారు.

మానవజాతి పుట్టినప్పటి నుంచి సెక్స్ సమస్య ఉందని, పురాణాలు, రాజుల కాలం నుంచి ఉన్న సమస్య ఇదని, అయితే ఇండస్ట్రీకి చెడ్డపేరు తెచ్చేవారిని మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. వ్యక్తిగతంగా ఒకరు చేసిన తప్పులకు ఇండస్ట్రీ మొత్తం బాధ్యత వహించబోదని అన్నారు. గతంలో దాసరి, రామానాయుడు, ఎంఎస్ రెడ్డి వంటి పెద్దమనిషులు చెబితే వినే పరిస్థితి ఉండేదని, ఇప్పుడది లేదని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.

1000 మంది సభ్యులున్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను మార్చడం చాలా కష్టమైన పనని అన్నారు. ఈ ఆర్గనైజేషన్ కు లీడర్ గా నిలిచేందుకు ఎవరూ లేరని తెలిపారు. జరుగుతున్న పరిణామాలను చూస్తే తనకు బాధ కలుగుతోందని, సమస్యల పరిష్కారానికి చర్చిస్తున్నామని ఆయన అన్నారు. ఇండస్ట్రీలో తప్పుంటే ఒప్పుకుని సరిదిద్దుకుంటామని, అయితే, చాలా పెద్ద పరిశ్రమ అయినందున తమ దృష్టికే రావడం లేదని అన్నారు. రాత్రికి రాత్రే ఏ సమస్యా పరిష్కారం కాదని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.

Tollywood
Daggubati Suresh Babu
Casting Couch
Interview
  • Loading...

More Telugu News