Vijay malya: మాల్యాకు చెందిన విలాసవంతమైన విమానం... ఎట్టకేలకు అమ్ముడుపోయింది!
- బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తిరుగుతున్న మాల్యా
- మూడోసారి వేలంలో లగ్జరీ జెట్ విక్రయం
- సొంతం చేసుకున్న అమెరికా కంపెనీ
బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకుని, వాటిని ఎగ్గొట్టి, ప్రస్తుతం లండన్ లో దర్జాగా తిరుగుతున్న లిక్కర్ కింగ్, యూబీ గ్రూప్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు చెందిన లగ్జరీ విమానం ఎట్టకేలకు వేలంలో అమ్ముడైంది. గతంలో రెండుసార్లు ఈ జెట్ విమానాన్ని (ఎయిర్ బస్ ఏ319-133సీ వీటీ-వీజేఎం ఎంఎస్ఎం 2650) వేలం వేసినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ దఫా మాత్రం ఓ అమెరికన్ సంస్థ రూ. 34.8 కోట్లకు బిడ్ వేయగా, బాంబే హైకోర్టు ఈ బిడ్ ను ఆమోదించింది. ఈ డబ్బుతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ సర్వీస్ టాక్స్ విభాగానికి చెల్లించాల్సిన బకాయిలను రికవరీ చేసుకుంటామని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ విమానంలో 25 మంది ప్రయాణికులు, మరో ఆరుగురు సిబ్బంది ప్రయాణం చేయవచ్చు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో తయారైన ఈ విమానంలో పడకగది, బాత్ రూమ్, బార్, కాన్ఫరెన్స్ హాల్ వంటివన్నీ ఉన్నాయి. మాల్యా దివాలా తరువాత దీన్ని ముంబై ఎయిర్ పోర్టులో పార్కు చేసి ఉంచారు. దీనివల్ల గంటకు రూ. 15 వేల వరకూ తమకు నష్టం వస్తోందని, దీన్ని ఎయిర్ పోర్టు నుంచి తొలగించాలని విమానాశ్రయం అధికారులు బాంబే హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇక ఈ విమానాన్ని అమెరికాకు తరలించి, ప్రీమియం కస్టమర్లకు సేవలందించేందుకు వినియోగిస్తామని అమెరికన్ కంపెనీ తెలిపింది.