Chandrababu: ఎంపీల సమావేశం వీడియోను ఎవరు తీశారో , ఎందుకు విడుదల చేశారో విచారణ చేయిస్తాం!: చంద్రబాబు

  • జోకులకు ఇదేనా సందర్భం?
  • ఏది పడితే అది మాట్లాడితే ఎలా?
  • ఎంపీలకు క్లాస్ పీకిన చంద్రబాబు

బరువు తగ్గడానికి దీక్షలు చేయాలని, విశాఖకు రైల్వే జోనూ లేదు, గీనూ లేదని, దీక్ష చేస్తే ఒక్కరోజులోనే ఆసుపత్రికి తరలించాలని.. జోకులు వేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ పరువు తీసిన వీడియో వైరల్ అవుతున్న వేళ, అసలు ఈ వీడియోను ఎవరు తీశారు? ఏ ప్రయోజనాలు ఆశించి బయటకు విడుదల చేశారన్న కోణంలో విచారణ జరిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఎంపీల చలోక్తులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, జోకులేసుకునేందుకూ ఓ సందర్భం ఉంటుందని, పార్టీ నేతల పోరాటానికి విలువ లేకుండా మాట్లాడటం ఏంటని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ తదితరులపై అక్షింతలు వేశారు. ఏది పడితే అది మాట్లాడితే ఎలాగని ప్రశ్నించిన చంద్రబాబు, రాష్ట్రం మొత్తం టీడీపీ పోరాటం వైపు చూస్తుంటే, ఈ తరహా బాధ్యతా రాహిత్యపు వ్యాఖ్యలేంటని క్లాస్ పీకారు.

కాగా, ఎంపీల వ్యక్తిగత సిబ్బందే ఈ వీడియోను తీసుంటారని భావిస్తుండగా, ఎవరు తీశారన్న విషయాన్ని తేల్చనున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఎంపీలతో మాట్లాడుతున్న వేళ, చంద్రబాబు తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, టీడీపీపై కుట్ర చేసేందుకు ఎన్నో శక్తులు వేచిచూస్తున్నాయని, ఏ మాత్రం అవకాశం వచ్చినా బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు పార్టీ నేతలే అవకాశం ఇస్తే ఎలాగని ప్రశ్నించారు.

ఎన్నికల సంవత్సరం ఎంతో కీలకమని, ఈ సమయంలో ఏమరుపాటు తగదని సలహా ఇచ్చారు. మీడియా సైతం ఏ మాత్రం సంయమనాన్ని పాటించకుండా, వీడియోల నిజానిజాలు తెలుసుకోకుండా వైరల్ చేస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News