Hyderabad: జూబ్లీహిల్స్ అష్టదిగ్బంధం... ఎటునుంచి ఎటొచ్చినా మందుబాబులను పట్టేసిన పోలీసులు!
- భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు
- ఎటునుంచి వచ్చినా తనిఖీలు తప్పించుకోలేకుండా చర్యలు
- 32 కార్లు, 44 బైకులు స్వాధీనం
గత రాత్రి మందు కొట్టి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు భారీ ఎత్తున రంగంలోకి దిగిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అష్టదిగ్బంధమే చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు సమీపంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, ఏ వాహనం ఎటునుంచి వచ్చినా, అదే దారిలో వచ్చేలా చేశారు. మాదాపూర్ నుంచి వచ్చే వాహనాలు బ్లడ్ బ్యాంక్ ముందు నుంచి యూటర్న్ తీసుకుని పంజాగుట్ట వైపు వెళ్లేలా చూడటంతో పాటు, బంజారాహిల్స్, అపోలో ఆసుపత్రి నుంచి వచ్చే వాహనాలనూ అదేవైపు మళ్లించారు. మాదాపూర్ నుంచి వస్తూ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను తప్పించుకునేందుకు మందుబాబులు వాడే జూబ్లీహిల్స్ క్లబ్ దారిని మూసేశారు.
ఇక వీకెండ్ కావడంతో వివిధ పబ్బుల్లో పీకలదాకా తాగిన పలువురు యువతీ యువకులు ఈ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. మొత్తం 32 కార్లు, 44 బైకులపై వచ్చిన వారు మందు కొట్టినట్టు గుర్తించిన పోలీసులు, ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు పెట్టారు. వీరిలో పలువురు అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు తెలిపారు.