ananth kumar hegde: ప్రతిపక్షాలను జంతువులతో పోల్చిన కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే
- కాకులు, కోతులు, నక్కలుగా అభివర్ణన
- అవన్నీ కలసి పులికి వ్యతిరేకంగా ఒక్కటై వస్తున్నాయి
- పులినే ఎన్నుకోవాలని పిలుపు
కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే ప్రతిపక్షాలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు జంతువులని, అవన్నీ కలసి పులికి వ్యతిరేకంగా వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని కార్వార్ లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి హెగ్డే మాట్లాడారు.
‘‘ఒకవైపు కాకులు, కోతులు, నక్కలు, ఇతర జంతువులన్నీ కలసి ఒక్కటిగా వస్తున్నాయి. మరోవైపు మాకు పులి (మోదీ) ఉంది. 2019లో పులినే ఎన్నుకోవాలి’’ అని అనంతకుమార్ హెగ్డే అన్నారు. బీజేపీ 70 ఏళ్లు పాలించి ఉంటే గనుక ప్లాస్టిక్ కుర్చీలకు బదులు వెండి కుర్చీల్లో కూర్చుని ఉండేవారని పేర్కొన్నారు.
ఐదు సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. జనవరిలో దళితులను ఆయన శునకాలతో పోల్చారు. ఆ తర్వాత దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ ప్రాంత ప్రజలే అచ్చమైన కన్నడ మాట్లాడగలరని, ఇతరులు, కనీసం బెంగళూరు, మైసూరు ప్రాంత ప్రజలకు సైతం కన్నడ ఎలా మాట్లాడాలో తెలియదన్నారు.