India: అమెరికా ఒత్తిడికి తలొగ్గుతున్న ఇండియా!
- ఇరాన్ పై పలు ఆంక్షలు విధించిన అమెరికా
- చమురు దిగుమతులు ఆపేయాలని ఇండియాకు సూచన
- భారత పర్యటనలో నిక్కీ హేలీ
ఇరాన్ నుంచి చమురు దిగుమతులు క్రమంగా నిలిపివేయాల్సిందేనని అమెరికా తెస్తున్న ఒత్తిడికి ఇండియా తలొగ్గుతోంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, వాటి వల్ల ప్రపంచానికి ముప్పు పరిణమించే అవకాశాలు ఉన్నాయని, ఇండియా, చైనా వంటి దేశాలు చమురు కొనుగోలుకు ఇస్తున్న డబ్బును ఇరాన్ అణ్వాయుధాలకు వాడుతోందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ పై ఎన్నో ఆంక్షలు విధించిన అమెరికా, వీటిని మిగతా దేశాలన్నీ పాటించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఐక్యరాజ్యసమితిలో అమెరికా దౌత్యాధికారి నిక్కీ హేలీ సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇరాన్ కు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకమవుతోందని వ్యాఖ్యానించారు. భారత్ కలసి రావాలని సూచించారు. ఒబామా పాలనలో ఇరాన్ నుంచి చమురు దిగుమతిని భారత్ గణనీయంగా తగ్గించుకుందని గుర్తు చేశారు. ఆ సమయంలో సరాసరిన ప్రతి ఆరు నెలలకూ 20 శాతం వరకూ దిగుమతి తగ్గిందని, ఇప్పుడు ట్రంప్ దాన్ని జీరో స్థాయికి చేయాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. గతంతో పోలిస్తే ఇరాన్ బలపడిందని, అది ప్రపంచానికి ప్రమాదమని అభిప్రాయపడ్డారు.
కాగా, అమెరికా, భారత్ ల మధ్య రక్షణ, విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం రద్దుపై ఆమె స్పందిస్తూ, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్నందువల్లే ఈ సమావేశం ఆగిందని, త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని నిక్కీ హేలీ తెలిపారు. ఇక అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన ఇండియా, ఇరాన్ నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వ రంగ ఓఎంసీలకు ఇప్పటికే సూచించింది. నవంబర్ లోగా, ప్రస్తుత దిగుమతులతో పోలిస్తే 40 నుంచి 45 శాతం మేరకు దిగుమతులను తగ్గించాలని పేర్కొంది.