Rahul Gandhi: మానస సరోవరానికి రాహుల్ గాంధీ... తమకేమీ తెలియదంటున్న కేంద్ర ప్రభుత్వం!
- కైలాస మానస సరోవరం యాత్రకు వెళతానన్న రాహుల్
- తమకింకా సమాచారం రాలేదని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
- సెప్టెంబర్ 8 వరకూ జరగనున్న యాత్ర
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హిమాలయాల్లో కైలాస మానస సరోవరం యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ విషయమై తమకేమీ సమాచారం లేదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టత ఇచ్చింది. రాహుల్ నుంచి తమకు ఇంతవరకూ మానస సరోవర యాత్ర గురించి ఎటువంటి దరఖాస్తూ రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పరిధిలో స్వతంత్ర రీజియన్ గా ఉన్న టిబెట్ లోని కైలాస పర్వతానికి తాను వెళ్లాలని అనుకుంటున్నట్టు రాహుల్ నుంచి ఎటువంటి ప్రాథమిక సమాచారం రాలేదని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కైలాస మానస సరోవరం పర్యటనకు రాహుల్ వెళతారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర చేయాలంటే విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి.
విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా యాత్ర సాగుతుందని, తమ వెబ్ సైట్లో పేర్లు నమోదు చేయించుకుంటే, డ్రా తీసి యాత్రకు ఎవరిని అనుమతించేది నిర్ణయిస్తామని, ప్రైవేటు ట్రావెల్ ఏజన్సీలు కూడా యాత్రను ఏర్పాటు చేస్తుంటాయని రవీష్ కుమార్ వెల్లడించారు. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ 29న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జన్ ఆక్రోశ్ ర్యాలీ జరిగిన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, కైలాస మానస సరోవరం యాత్ర గురించి ప్రస్తావించారు. ఇప్పటికే మొదలైన కైలాస యాత్ర సెప్టెంబర్ 8 వరకూ కొనసాగనుంది.