Pawan Kalyan: ఉత్తరాంధ్ర ప్రజల్లో పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: నారా లోకేశ్
- ఉత్తరాంధ్ర సహా, రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశాం
- గౌతు శివాజీ లాంటి వ్యక్తిపై పవన్ ఆరోపణలు చేయడం తగదు
- కర్నూలును దేశ రెండో రాజధాని చేయమని బీజేపీ నేతలు అడగరే?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లా గుడివాడలో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఈ రోజు ఆయన ఆవిష్కరించారు. అనంతరం, లోకేశ్ మాట్లాడుతూ, గౌతు లచ్చన్న గొప్పతనం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. గౌతు శివాజీ లాంటి వ్యక్తిపై పవన్ చేసిన ఆరోపణలు బాధించాయని అన్నారు. విమర్శలు చేసేముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని పవన్ కు హితవు పలికారు.
‘ఉత్తరాంధ్ర రాష్ట్ర ఉద్యమం’ అంటూ ఉత్తరాంధ్ర ప్రజల్లో పవన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. ఉత్తరాంధ్ర సహా, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తమ హయాంలో అభివృద్ధి జరిగిందని అన్నారు. బీజేపీపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కర్నూలు డిక్లరేషన్’ అనే బీజేపీ.. కర్నూలును దేశ రెండో రాజధాని చేయమని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. తిరుమల వెంకన్న నగల విషయంలో విమర్శలు చేస్తూ నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.