Pawan Kalyan: బొగ్గు, జ‌బ్బులు మాకు... డ‌బ్బులు పోర్టుకు: పవన్‌ కల్యాణ్‌తో విశాఖ వ‌న్ టౌన్ వాసులు

  • పోర్టు కాలుష్యంతో వేలాది మందికి దీర్ఘ‌కాలిక రోగాలు
  • నల్లగా మారిపోతోన్న తినే తిండి, క‌ట్టుకునే దుస్తులు
  • ఎన్నోసార్లు ఆందోళ‌న‌లు చేసినప్పటికీ ప‌ట్టించుకోవ‌డం లేదు
  • స్థానిక నాయ‌కుల‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం శూన్యం

పోర్ట్ ట్రస్ట్ నిర్లక్ష్యం మూలంగా కాలుష్యంతో న‌ల్ల‌గా మారిన విశాఖ వ‌న్ టౌన్ లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ పార్టీ మీడియా హెడ్‌ హరిప్రసాద్‌ ఈరోజు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోర్టు కాలుష్యంతో వేలాది మంది దీర్ఘ‌కాలిక రోగాల బారిన ప‌డుతున్నార‌ని తెలుసుకున్న పవన్‌ కల్యాణ్‌.. పాత‌ప‌ట్నంలోని కోట‌ వీధిలో కాలి న‌డ‌క‌న ప‌ర్య‌టించారు. అక్క‌డ రాశులుగా పోసిన బొగ్గు నిల్వ‌ల‌ను ప‌రిశీలించారు.

త‌మ క‌ష్టాల‌ను తెలుసుకోవ‌డానికి జ‌న‌సేన అధినేత వ‌చ్చారని తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి తమ క‌ష్టాలు ఏక‌రువు పెట్టారు. పోర్టు పరిధిలో బొగ్గు పొడి, యూరియా, ఇనుప ఖనిజం, గంధకం లాంటివి రాశులుగా పోసి నిల్వ చేస్తున్నార‌ని, స‌ముద్రం మీదుగా వ‌చ్చే గాలుల‌తో బొగ్గు నిల్వ‌ల నుంచి దుమ్ము రేగి నగరం పైకి వస్తోంద‌ని, దీంతో పోర్టు ప‌రిస‌ర ప్రాంతాల‌తోపాటు సుమారు 14 కిలోమీట‌ర్ల పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు కాలుష్యం బారిన ప‌డుతున్నాయ‌ని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పోర్టు కాలుష్యం వ‌ల్ల తినే తిండి, తాగేనీరు, క‌ట్టుకునే దుస్తులు న‌ల్ల‌గా మారిపోతున్నాయ‌ని చెప్పారు. ఇక్క‌డ వాయు కాలుష్యం వ‌ల్ల చిన్న‌పిల్ల‌లు ఊపిరితిత్తుల వ్యాధుల‌కు గుర‌వుతున్నార‌ని, వృద్ధులు కీళ్ల‌నొప్పులు, క్యాన్సర్ బారిన ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. బొగ్గు, జ‌బ్బులు త‌మ‌కిచ్చి.. డ‌బ్బులు మాత్రం పోర్ట్ ట్ర‌స్ట్ పొందుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై ఎన్నోసార్లు ఆందోళ‌న‌లు చేసినప్పటికీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, స్థానిక నాయ‌కుల‌కు ఫిర్యాదు చేసిన ఫ‌లితం లేద‌ని జ‌న‌సేనాని ముందు వారు వాపోయారు. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి హెచ్చ‌రించినా పోర్టు యాజ‌మాన్యం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని తెలిపారు.

కాలుష్య బాధితుల క‌ష్టాలు విన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. పోర్టు ట్రస్ట్ నిర్లక్ష్యం మూలంగా చోటు చేసుకొంటున్న కాలుష్యంపై చేపట్టే పోరాటంలో బాధితుల‌కు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం ముడ‌స‌రిలోవ చేరుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్కడి రిజ‌ర్వాయ‌ర్ ను ప‌రిశీలించారు. రిజ‌ర్వాయ‌ర్ భూములు క‌బ్జాకు గుర‌య్యాయ‌ని తెలుసుకుని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌కృతి వ‌న‌రుల‌ను దోచేస్తే బ‌త‌క‌డం ఎలా? అని ప్ర‌శ్నించారు.                              

  • Loading...

More Telugu News