Pawan Kalyan: టీడీపీ, వైసీపీలకు డబ్బులిస్తేనే జనం వస్తారు.. జనసేనకు మాత్రం స్వ‌చ్ఛందంగా వస్తారు!: పవన్ కల్యాణ్

  • నాయకులు వస్తారు, పోతారు.. జనసైనికులు మాత్రం ఎప్పటికీ ఉంటారు
  • ఉత్తరాంధ్ర ఆత్మను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన
  • సమస్యలను అర్థం చేసుకోవడానికే 2009లో పోటీ చేయలేదు
  • రాజకీయ సుస్థిరత కోసం 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చా

2019 సంవ‌త్స‌రంలో స‌రికొత్త రాజ‌కీయ వ్య‌వ‌స్థ రాబోతుంద‌ని, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడబోతోందని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ధీమా వ్య‌క్తం చేశారు. జ‌న‌సేన పార్టీకి జీవం జ‌న‌సైనికులే అని అన్నారు. నాయ‌కులు ఉండొచ్చు, వెళ్లిపోవ‌చ్చని... కానీ, జ‌న‌సైనికులు మాత్రం ఎప్పుడూ తనతోనే ఉంటార‌ని చెప్పారు. టీడీపీ, వైసీపీల‌కు డ‌బ్బులిస్తేనే జ‌నం వ‌స్తారని... జ‌న‌సేనకు మాత్రం స్వ‌చ్ఛందంగా, ప్రేమ‌తో వ‌స్తార‌ని... వారు డ‌బ్బుకు అమ్ముడుపోయే వ్య‌క్తులు కాద‌ని అన్నారు. జ‌న‌సేన పార్టీలో చేరిన నాయ‌కులు జ‌న‌సైనికుల్ని గౌర‌వించాల‌ని, వారిని గౌర‌విస్తే తనను గౌర‌వించిన‌ట్లేన‌ని చెప్పారు. ఇన్ని సంవ‌త్స‌రాలు ఇంత ప్రేమ‌ను ఇచ్చిన మీకు తన తుది శ్వాస వ‌ర‌కు వెన్నంటే ఉంటానని, ప్రజా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. విశాఖలో మాట్లాడుతూ పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

సినీ నటుడిగా తన ప్రయాణాన్ని ఉత్త‌రాంధ్ర నుంచి ఎలాగైతే ప్రారంభించానో... రాజ‌కీయ ప్ర‌యాణాన్ని కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించానని పవన్ చెప్పారు. ఉత్తరాంధ్ర వెన‌కబ‌డిన ప్రాంతం కాదని, వెనక్కి నెట్టేసిన ప్రాంతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్త‌రాంధ్ర యాస, భాష‌, క‌ళ‌ల‌తో పాటు ఆత్మ‌ను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ జ‌న‌సేన మాత్రమేనని చెప్పారు. ఈ ప్రాంత స్వ‌రూపాన్ని, స్వ‌భావాన్ని అర్థం చేసుకున్న స్థానిక నాయ‌కుల‌కే జ‌న‌సేన పెద్ద‌పీట వేస్తుందని స్పష్టం చేశారు.

 2003లో రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నానని... 2009లో పోటీ చేయ‌క‌పోవ‌డానికి ముఖ్య కార‌ణం స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకోవ‌డం కోస‌మేనని చెప్పారు. 2014లో రాజకీయ సుస్థిర‌త కోసం టీడీపీ, బీజేపీ పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చానని తెలిపారు. రాజ‌కీయాల్లో ల‌బ్ధి పొందాల‌నుకుంటే ఆనాడు బీజేపీని కేంద్ర‌మంత్రి ప‌ద‌విని అడిగేవాడినని... టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చినందుకు బేర‌సారాలు ఆడేవాడినని చెప్పారు. కానీ, దేశ రాజ‌కీయాల్లో విలువ‌లు బ‌తికే ఉన్నాయ‌ని చెప్పడానికే, అవేవీ ఆశించ‌కుండా మ‌ద్ద‌తు ప‌లికానని తెలిపారు.

జ‌న‌సైనికుల కోసం జులై 2 నుంచి శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయని పవన్ చెప్పారు. ప్ర‌తి జిల్లా నుంచి 3 వేల మందిని ఇందుకోసం ఎంపిక చేశామని తెలిపారు. ఎవ‌రైనా రాజ‌కీయాల్లోకి రాగానే ప‌ద‌విని కోరుకుంటున్నారని.. తాను మాత్రం స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం వెత‌క‌డం కోసం వ‌చ్చానని చెప్పారు. త్రిక‌ర‌ణ శుద్ధితో, చాలా స‌హనంతో రాజ‌కీయాల్లో ఉంటున్నానని తెలిపారు. తనకు ఓపిక చాలా ఎక్కువని... ఎంత ఓపిక అంటే ఒక సినిమా హిట్ కోసం 12 ఏళ్లు ఎదురుచూసేంత అని చెప్పారు. 2019లో జ‌న‌సేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. జనసేన నేతలంతా మ‌న‌స్పూర్తిగా పార్టీ విజ‌యానికి కృషి చేయాల‌ని కోరుకుంటున్నానని చెప్పారు. మేధావుల స‌ల‌హాలతో పార్టీ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News