Shekhar Kammula: దర్శకుడు శేఖర్ కమ్ముల పేరిట ఆన్ లైన్ మోసం!
- సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఫేక్ యాడ్స్
- శేఖర్ కమ్ముల అసిస్టెంట్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి
- కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పేరును వాడుకుంటూ, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ప్రబుద్ధుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం పూర్వాపరాలను పరిశీలిస్తే, ఓ యువకుడు తాను శేఖర్ కమ్ముల అసిస్టెంట్ నని ప్రచారం చేసుకుంటూ, తాము తీయబోయే తదుపరి చిత్రానికి నటీ నటులు కావాలంటూ ఆన్ లైన్ లో ఫేక్ యాడ్స్ పెట్టాడు.
వీటిని నమ్మి సంప్రదించిన అమ్మాయిలు, అబ్బాయిల నుంచి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించుకున్నాడు. అనంతరం తమకు అవకాశాలు ఎప్పుడు ఇస్తారంటూ శేఖర్ కమ్ములను కొందరు బాధితులు సంప్రదించారు. దీంతో, అసలు విషయాన్ని తెలుసుకున్న శేఖర్ కమ్ముల కంగుతిన్నారు. ఆపై విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తి ఎవరన్న సంగతి తేల్చేందుకు రంగంలోకి దిగారు.