BJP: నితీశ్ కుమార్ కు జ్ఞానోదయం అయింది... కానీ, ఇప్పటికే ఆలస్యమైంది: తేజస్వీ యాదవ్
- బీజేపీతో కలిస్తే అభివృద్ధి పరుగులు తీస్తుందని అనుకున్నారు
- నితీశ్ ఆలోచనలు కలలుగానే మిగిలాయన్న తేజస్వీ
- మహాకూటమిలో చేర్చుకునేది లేదని స్పష్టీకరణ
మహాకూటమిని వద్దనుకుంటూ, ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని, బీజేపీతో కలిస్తే బీహార్ రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కన్న కలలు కల్లలుగానే మిగిలాయని, తన ఆలోచన భ్రమగా మిగిలిపోవడంతో, ఇప్పుడాయన తిరిగి మహాకూటమి వైపు చూస్తున్నారని, కానీ ఇప్పటికే ఆలస్యం జరిగిపోయిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు నితీశ్ తిరిగి ఆర్జేడీతో కలుస్తానన్నా, తాము కలుపుకుని వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
నితీశ్ వ్యూహాలు బెడిసికొట్టాయని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఆయన సాధించలేకపోయారని ఆరోపించారు. హోదా కాదు కదా, కనీసం ప్యాకేజీని కూడా తేలేదని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ విశ్వసనీయత కోల్పోయారని, మళ్లీ మహాకూటమిలో చేర్చుకుంటే, కొంతకాలం తరువాత ఆయన బయటకు వెళ్లరన్న నమ్మకం తమకు లేదని, ఆయనకు తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయని అన్నారు.
కాగా, ఇటీవలి కాలంలో ఎన్డీయేకు నితీశ్ దూరం జరుగుతుండగా, ఆయన్ను తిరిగి మహాకూటమిలోకి ఆహ్వానించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తేజస్వీ అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.