Pawan Kalyan: ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై రేపు మేధావులతో పవన్ కల్యాణ్ చర్చలు

  • ఈనెల 27వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు సమావేశం
  • జులై 8వ తేదీన విశాఖ జిల్లా పర్యటన ముగింపు
  • అదే రోజు పదివేల మంది జనసైనిక్స్ తో భారీ ప్రదర్శన

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జరుపుతోన్న జన పోరాట యాత్ర ఎల్లుండి నుంచి విశాఖపట్నంలో తిరిగి ప్రారంభం కాబోతుంది. ఆ నగరానికి కాస్త దూరంగా ఉన్న ఓ విడిది గృహంలో ఆయన బసచేస్తున్నారు. నిన్న సాయంత్రం, నేడు పార్టీ శ్రేణులతో జిల్లా సమస్యలు, పార్టీ నిర్మాణంపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. కాగా, రేపు (27వ తేదీ) ఉదయం పదిన్నర గంటలకు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మేధావులతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ సమావేశానికి కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్  కె.ఎస్.చలం సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. గీతం యూనివర్సిటీకి సమీపంలోనున్న సాయి ప్రియ విడిది గృహంలో జరగనున్న మేధావుల సమావేశంతో ఈ మలివిడత పర్యటన ప్రారంభమవుతుంది. జులై 8వ తేదీన విశాఖ జిల్లా పర్యటన ముగుస్తుంది. ఎనిమిదో తేదీన 10,000 మంది జనసైనిక్స్ తో భారీ ప్రదర్శనను జనసేన పార్టీ ఏర్పాటు చేస్తోంది.

జనసైనిక్స్ విశాఖ నగరంలో నిరసన కవాతు చేస్తారు. పవన్ కల్యాణ్ ఈ కవాతును ముందుండి నడిపిస్తారు. ఎరుపు దుస్తులు ధరించిన ఆజాద్ యువజన విభాగం, ఆరంజ్ కలర్‌ దుస్తులతో భగత్ సింగ్ విద్యార్థి విభాగం, తెల్లటి దుస్తులతో సేవ దళ్ విభాగం, ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించి జనసేన రక్షక దళ్ పవన్ కల్యాణ్ ను అనుసరిస్తారు. దీంతో పాటు జిల్లాలో అనకాపల్లి, చోడవరం, గాజువాక, పెందుర్తి, భీమిలితో పాటు విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గాలలో జరగనున్న బహిరంగ సభలలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు.

విశాఖ నగరంలో కాలుష్యం, భూ ఆక్రమణలు, పౌర సదుపాయాలను స్వయంగా పరిశీలిస్తారు. విశాఖ‌న‌గ‌రం, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన వివిధ వ‌ర్గాల వారు, వ్యాపార‌, వాణిజ్య ప్ర‌ముఖులు, రాజ‌కీయవేత్త‌లు, స్వ‌చ్ఛంద సేవ‌కులు త‌దిత‌రుల‌ను క‌లుస్తారు. విశాఖ పర్యటన అనంతరం రెండు రోజుల చొప్పున విజయవాడ, హైదరాబాద్ లలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వెళతారు. అనంత‌రం జులై 14 లేక ఆ తరువాత జనసేన పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమ‌వుతుంది.

  • Loading...

More Telugu News