Chandrababu: ఇటువంటి మనిషి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా?: చంద్రబాబుపై జగన్ విమర్శలు
- బోడసకుర్రులో వైఎస్సార్ పేదవారికి స్థలాలు ఇచ్చారు
- ఆ స్థలాలను చంద్రబాబు బలవంతంగా లాక్కుంటున్నారు
- ఫ్లాట్లు కట్టిస్తామని మభ్యపెడుతున్నారు
- పేదల స్థలంపై కూడా అవినీతి చేస్తున్నారు
తూర్పు గోదావరి జిల్లాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేశారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ధాన్యాలకు గిట్టుబాటు ధరల్లేవని రైతులు బాధపడుతున్నారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆయన ర్యాలీలో మాట్లాడుతూ... "అప్పట్లో నాన్నగారి కాలంలో పంటలకు మద్దతు ధరలు ఉండేవి. రైతులు లాభం పొందేవారు. చంద్రబాబు సీఎం కాగానే ధరలు పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెరిటేజ్ కంపెనీ కోసం రైతుల దగ్గరి నుంచి తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. హెరిటేజ్ ద్వారా మూడురెట్ల ఎక్కువ ధరలకు అమ్ముకుంటారు. చేపలకు, రొయ్యలకు కూడా గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు పరిపాలనలో తాగడానికి మినరల్ వాటర్ ఉండడం లేదు.. కానీ, ఫోను కొడితే మందు బాటిల్ తీసుకుని నేరుగా ఇంటికి వస్తున్నారు. తాగునీటి పథకాల్లో పని చేస్తోన్న వారికి 8 నెలల నుంచి జీతాలు లేవు.
దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో అడిగిన వారందరికీ ఇళ్లు వచ్చేవి. చంద్రబాబు నాయుడి పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు చంద్రబాబు అన్న మాటలను ప్రతి పేదవాడు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. అన్నాడా లేదా? నాలుగేళ్లలో ఒక్క ఇల్లయినా కట్టించాడా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు?
అప్పట్లో వైఎస్సార్.. పేదవారికి ఇళ్ల కోసం బోడసకుర్రులో స్థలం ఇచ్చారు. ఆ స్థలాలను చంద్రబాబు బలవంతంగా లాక్కుంటున్నారు.. ఫ్లాట్లు కట్టిస్తామని మభ్యపెడుతున్నారు. పేదల స్థలంపై కూడా అవినీతి చేసే మనిషి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఆ ఫ్లాట్ల రేటు ఎంతో తెలుసా? అడుగుకి రెండు వేలట.. మొత్తం 6,00,000 రూపాయలకి అమ్ముతారట. ఆ ఫ్లాట్లలో లిఫ్టు, మార్బుల్ ఫ్లోరింగ్ కూడా లేవు" అంటూ విమర్శించారు జగన్.