Election: నవంబరు-డిసెంబరులో ముందస్తు ఎన్నికలు.. ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహంలో మోదీ!
- ‘ముందస్తు’కే మొగ్గు చూపుతున్న మోదీ
- మిత్రపక్షాలకు ఇప్పటికే అందిన సంకేతాలు
- ఏపీ, తెలంగాణ ఎన్నికలు ముందుగానే
ముందస్తు ఎన్నికలపై ఇటీవల ఎడతెగని చర్చ జరుగుతోంది. నిజానికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని బీజేపీ తొలి నుంచి భావిస్తోంది. అయితే, దీనిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ ముందస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రత్యర్థులు వ్యూహప్రతివ్యూహాల్లో ఉండగానే, వారు పూర్తిగా ఒక్కటి కాకముందే దెబ్బకొట్టాలని ప్రధాని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమ అభిప్రాయాలతో ఏకీభవించే కొన్ని పార్టీలకు ఇప్పటికే ఈ విషయంలో సంకేతాలు పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం అక్కడి నుంచి రాగానే పదేపదే ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడడం ఇందుకు ఊతమిస్తోంది.
అలాగే, లోక్‌సభ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లోనూ ఒకేసారి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిపించాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. నవంబరు-డిసెంబరు నెలల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితోపాటు పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, తమిళనాడులో ఎన్నికలు జరిపించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలను ఒప్పించేందుకు మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.