kcr: బెదిరింపు మాటలొద్దు.. దమ్ముంటే, ముందస్తు ఎన్నికలు పెట్టు!: కేసీఆర్ కు వీహెచ్ సవాల్
- ఎన్నికలకు మేము భయపడే వాళ్లం కాదు
- జులై నాటికి ఎన్నికలు ప్రకటించాలి
- మా పార్టీలో అంతర్గత కలహాలు లేవు
కేసీఆర్ కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలు పెట్టాలి తప్ప, బెదిరింపు మాటలు మాట్లాడొద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) సవాల్ విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ బెదిరింపు మాటలు పక్కనపెట్టి ముందస్తు ఎన్నికలకు రావాలని, ఎన్నికలకు తాము భయపడే వాళ్లం కాదని చెప్పారు. ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీల చిట్టా తమ వద్ద ఉందని, ఆ చిట్టా గురించి ప్రస్తావించి ప్రజల వద్ద ఓట్లు తీసుకుంటామని అన్నారు.
ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కే ఎన్నికలంటే భయమని, తమకు మాత్రం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పిన సోనియా తన మాట నిలబెట్టుకుందని, మోసం చేసింది కేసీఆర్ అని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని ఎన్నికల ముందు చెబుతామని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే జులై నాటికి ఎన్నికలు ప్రకటించాలని, తాము కూడా రెడీగా ఉన్నామని ఘంటాపథంగా చెప్పారు.
తమ పార్టీలో అంతర్గత కలహాలు లేవని, తామంతా ఒకటేనని వీహెచ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నేతల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ‘టీఆర్ఎస్ లోకి వెళ్లే వారికి వెల్ కమింగ్ బాగా ఉంటుంది. రెడ్ కార్పెట్ వేస్తారు. ఆ తర్వాత ఆ కార్పెట్ గుంజేస్తారు. అనవసరంగా టీఆర్ఎస్ లోకి వెళ్లానని మా నాగేందర్ (దానం)కు కూడా రెండు నెలల్లో అర్థమవుతుంది’ అని అన్నారు.