emergency: నాడు రెండు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లాను: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ‘ఎమర్జెన్సీ: ఇండియన్ డెమోక్రసీ డార్కెస్ట్ అవర్’ పుస్తకావిష్కరణ
  • ఎమర్జెన్సీ గురించి కొత్తతరం తెలుసుకోవాలి
  • నాడు నన్ను అరెస్టు చేసి 17 నెలలు జైలులో ఉంచారు

నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు  రెండు నెలలు అజ్ఞాతంలో గడిపానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. ఎ.సూర్యప్రకాశ్ రచించిన ‘ఎమర్జెన్సీ: ఇండియన్ డెమోక్రసీ డార్కెస్ట్ అవర్’ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి కొత్తతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎమర్జెన్సీ మన చరిత్రలో భాగమని, దీని గురించి అందరూ తెలుసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యం పట్టాలు తప్పితే ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ఈ పుస్తకం చెబుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో స్వీయ అనుభవాల గురించి వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్, వాజ్ పేయి, అద్వానీ సహా పలువురిని జైలులో పెట్టారని, ఆ సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. తనను కూడా అరెస్టు చేసి 17 నెలలు జైలులో ఉంచారని, ఆ సమయంలోనే ప్రముఖ విపక్ష నేతలు, పాత్రికేయులు, రచయితలతో తనకు సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మోదీ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నారని చెప్పారు. అజ్ఞాతంలోకి వెళ్లి జైలులో ఉన్నవారి కుటుంబాలను ఆదుకోవడంలో మోదీ కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారని వెంకయ్యనాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News