tamma reddy: ఇలాంటి విషయాలను ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు: తమ్మారెడ్డి భరద్వాజ
- సినిమా వాళ్ల గురించి చాలామంది కలలుగంటారు
- సామాజిక మాధ్యమాల్లో కొందరు నీచంగా మాట్లాడుతున్నారు
- ఇలాంటి వారికి పబ్లిసిటీ కల్పించడం ఎందుకు?
సినిమా వాళ్లపై చాలా మందికి కోరికలుంటాయని, అందుకే కలల్లో ఊహించుకుంటారని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి విషయాలను ఎవరూ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరని అన్నారు. కొందరు తమకు ఫలానా హీరోయిన్ తో సంబంధం ఉందని, లేకపోతే ఫలానా హీరోతో సంబంధం ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా నీచమైన కామెంట్స్ చేస్తూ పబ్లిసిటీ పొందుతున్నారని, దిగజారిపోయేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ఇలాంటి వారికి పబ్లిసిటీ కల్పించడం వలన ఆయా సామాజిక మాధ్యమాలకు, మీడియా సంస్థలకు ఒరిగేదేమీ లేదని, ఇలాంటి పనుల వల్ల వాళ్ల పరపతి కూడా పోతుందని అన్నారు. అలాంటి సంబంధాలు అంటగట్టే ముందు సాక్ష్యాలు, ఆధారాలతో ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ షో గురించి కూడా తమ్మారెడ్డి ప్రస్తావించారు. తప్పు చేస్తేనే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారని, అలా అయితే, తప్పు చేసిన వారందరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసేసుకుంటారా? అని ప్రశ్నించారు.