YSRCP: వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుపై అట్రాసిటీ కేసు నమోదు
- జగ్జీవన్ రామ్ విగ్రహానికి దండ వేయలేదంటూ గొడవ
- కులం పేరుతో దూషించారంటూ టీడీపీ వర్గీయుల ఫిర్యాదు
- టీడీపీ వారే తొలుత దాడి చేశారన్న వైసీపీ
కృష్ణా జిల్లా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, బాపులపాడు మండలం ఏ.సీతారామపురంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి దండ వేయకుండా వెళ్లారనే అంశానికి సంబంధించి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో తమను కర్రలతో వెంటబడి కొట్టారని... కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ నూజివీడు పోలీసులకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఘటనలో రాళ్లదెబ్బలు తిన్న టీడీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, టీడీపీ వర్గీయులే తమపై తొలుత దాడికి యత్నించారంటూ వైసీపీ వర్గీయులు ఫిర్యాదు చేయగా... టీడీపీ వర్గీయులపై కూడా కేసు నమోదు చేశారు.